People: ఏలూరులో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ప్రజలు... ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
- కళ్లు తిరగడం, వాంతులతో బాధపడిన ప్రజలు
- అంతుబట్టని కారణాలు
- వింతగా అరుస్తున్న బాధితులు!
- ప్రజల్లో భయాందోళనలు
- బాధితులను పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని
అంతుచిక్కని కారణాలతో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో చోటుచేసుకుంది. కళ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలతో పాతికమంది వరకు ఆసుపత్రిపాలయ్యారు. కొందరు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికాగా, మరికొందరు శనివారం అస్వస్థతకు గురయ్యారు. అంతమంది ఒకే తరహా లక్షణాలతో అస్వస్థతకు గురికావడంపై ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు.
ఏలూరు వన్ టౌన్ పరిధిలోని పడమర వీధి, దక్షిణ వీధి ప్రాంతాల్లోనే ఈ తరహా కేసులు గుర్తించారు. బాధితుల్లో 18 మంది చిన్నారులే ఉన్నారు. కొందరు చిన్నారుల్లో మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అందరికీ ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రభుత్వాసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. కాగా, అస్వస్థతకు గురైన వారు వింతగా అరుస్తుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.