Chandrababu: ఏలూరు ఘటన తెలుసుకుని విస్మయానికి గురయ్యాను: చంద్రబాబు
- కలుషిత నీరు తాగి 150 మంది అస్వస్థతకు గురయ్యారు
- అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు
- తాగునీటి వ్యవస్థల గురించి 18 నెలలుగా ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది
- వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఘటన
ప్రజల పట్ల ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న తీరు పట్ల విస్మయానికి గురయ్యానంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయిన ఘటనపై ఆయన స్పందిస్తూ.. ‘ ఏలూరులో కలుషిత నీరు తాగి 150 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. స్థానిక తాగునీటి వ్యవస్థల గురించి 18 నెలలుగా ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పాలించే సమర్థత లేని, బాధ్యతారహిత వైసీపీ ప్రభుత్వం చర్యలను ఏలూరు ఘటన మరోసారి స్పష్టం చేసింది’ అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
కాగా, ఏలూరు ఘటనతో ప్రత్యేక వైద్య బృందాలు ఆ ప్రాంతానికి వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టాయి. ప్రజలు వారు తిన్న ఆహారం, తాగిన నీటితో పాటు పరిసరాలను పరిశీలించాయి. బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నాయి.