Somu Veerraju: తెలంగాణలో గెలిచాం.. ఏపీలో కూడా బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుంది: సోము వీర్రాజు ధీమా
- తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి గట్టి పోటీ ఇస్తుంది
- 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ-జనసేన కూటమి గెలుస్తుంది
- స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేయాలి
ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లలో గెలుపొందిన విషయం తెలిసిందే. మొదట దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో దూసుకుపోవడంతో ఏపీ బీజేపీలోనూ విశ్వాసం పెరిగింది. తెలంగాణలో తమ పార్టీ విజయం సాధించినట్లుగానే ఏపీలో కూడా బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
ఈ రోజు రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు. అలాగే, 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ-జనసేన కూటమి గెలిచి అధికారం చేపడుతుందని చెప్పారు. కాగా, ఇప్పటివరకూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం 24 లక్షల ఇళ్లు ఇస్తే వైసీపీ సర్కారు మాత్రం అందులో 17 లక్షలు ఇళ్లు మాత్రమే తీసుకుందని, దీంతో ఎనిమిది లక్షల ఇళ్లు వెనక్కిపోయాయని తెలిపారు .