Arvind Kejriwal: నిరసనల్లో ఉన్న రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రభుత్వం ... నేడు సరిహద్దులకు వెళ్లాలని కేజ్రీవాల్ నిర్ణయం!

Delhi CM To Review Facilities For Farmers Today

  • గత 10 రోజులుగా రైతు నిరసనలు
  • ప్రభుత్వం తరఫున సౌకర్యాలు
  • నేడు పరిస్థితిని సమీక్షించనున్న కేజ్రీవాల్

దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసనలు తెలియజేస్తున్న రైతులకు సంఘీభావం తెలపాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్, నేడు తన సహచరులతో కలిసి హర్యానా - ఢిల్లీ బార్డర్ కు వెళ్లనున్నారు. రైతులకు అక్కడ కల్పిస్తున్న ఏర్పాట్లను కేజ్రీవాల్ స్వయంగా సమీక్షించనున్నారు.

ఈ ఉదయం ఆయన సింఘు బార్డర్ కు వెళ్లి, రైతు నేతలతో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైతుల నిరసనలు 10వ రోజుకు చేరుకోగా, వారిని పరామర్శించేందుకు వెళుతున్న తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలవనున్నారు. ఇక రేపు జరగనున్న భారత్ బంద్ కు మద్దతివ్వాలని పలు విపక్ష పార్టీలు నిర్ణయించగా, ఆమ్ ఆద్మీ కూడా అదే దారిలో నడిచింది.

ఢిల్లీ-హర్యానా సరిహద్దులో రైతుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సౌకర్యాలను కల్పించిందని వ్యాఖ్యానించిన కేజ్రీవాల్, "8న జరిగే భారత్ బంద్ కు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా మద్దతిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఆప్ కార్యకర్తలు శాంతియుతంగా తమ నిరసనలను తెలియజేస్తారు. రైతులు తెలియజేస్తున్న నిరసనలకు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతున్నాను" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

గత పది రోజులుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ ప్రాంతాల్లో వేలాదిగా చేరిన రైతులు, తమను ఢిల్లీలోకి అనుమతించాలని నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్రం ఇటీవల తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తో వారు ఆందోళన చేస్తున్నారు. సింఘుతో పాటు టిక్రీ, ఘాజీపూర్ ‌లో సైతం రైతుల ఆందోళన కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News