Chandrababu: ఏలూరు ఘటనలో ప్రభుత్వం తీరు అనుమానాలకు తావిస్తోంది: చంద్రబాబు
- ఏలూరులో మరింత ముదురుతున్న వింతరోగం
- 450 దాటిన బాధితుల సంఖ్య
- శ్రీధర్ అనే వ్యక్తి మృతి
- శ్రీధర్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారన్న చంద్రబాబు
- పోస్టుమార్టం కోసం మళ్లీ స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ
ఏలూరులో బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ఏలూరు ఘటనలో ప్రభుత్వం తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. శ్రీధర్ మృతదేహాన్ని నిన్న కుటుంబసభ్యులకు అందించారని, పోస్టుమార్టం కోసమని మృతదేహాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం దాచేందుకు ప్రయత్నిస్తోందని ప్రశ్నించారు. ఈ ఘటనపై శ్రీధర్ బంధువుల ఆవేదన తాలూకు వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కాగా, 45 ఏళ్ల శ్రీధర్ విజయవాడలో చిన్న మెకానిక్ గా పనిచేసేవాడు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో భార్య స్వస్థలం అయిన ఏలూరుకు చేరాడు. ఏలూరులోని ఓ ప్రాంతంలో టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఉదయం వేళ టిఫిన్ సెంటర్ కు సామాన్లు తీసుకెళ్లే క్రమంలో ఒక్కసారిగా కిందపడిపోయాడు. నోటి నుంచి నురగ రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు.