dharmapuri Arwind: పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుంది: ధర్మపురి అరవింద్ ఫైర్
- దళారీలకు కేసీఆర్ బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారు
- గ్రేటర్ షాక్ కేటీఆర్ కు సరిపోలేదేమో
- రాజ్యాంగం గురించి తనకంటే కేసీఆర్ కే ఎక్కువ తెలుసన్న అరవింద్
దుబ్బాక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటడంతో బీజేపీ నేతల స్వరం పెరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేందుకు వారు ఏమాత్రం సంకోచించడం లేదు. తాజాగా కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. రైతులకు అన్యాయం చేస్తున్న దళారీలకు కేసీఆర్ బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని అన్నారు. రైతు చట్టాలపై కేసీఆర్, మంత్రులతో చర్చలకు సిద్ధమని చెప్పారు. ఉద్యమం అంటే ఏమిటో కేసీఆర్ కు చూపెడతామని... నియంత గడాఫీకి పట్టిన గతే చివరకు కేసీఆర్ కు పడుతుందని అన్నారు. కేసీఆర్ ను తెలంగాణ రైతులు త్వరలోనే గుడ్డలు ఊడదీసి కొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాదులో ధర్నా చౌక్ ను ఎత్తేసిన టీఆర్ఎస్ కు ధర్నా చేసే హక్కు లేదని అరవింద్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిలిన షాక్ మంత్రి కేటీఆర్ కు సరిపడలేదేమోనని ఎద్దేవా చేశారు. కేటీఆర్, కవితలు కమిషన్ ఇవ్వకపోవడం వల్ల... మంత్రులు, ఎమ్మెల్యేలు భూకబ్జాలు చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో పండుతున్న పసుపును పక్కన పెట్టేసి... కమిషన్ల కోసం ఇతర ప్రాంతాల నుంచి పసుపును దిగుమతి చేసుకుంటున్నారని చెప్పారు. కోట్లాది రూపాయల కమిషన్లు పోతాయనే ఆందోళనతోనే కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుందని అరవింద్ అన్నారు. రాజ్యాంగం గురించి తనకంటే కేసీఆర్ కు ఎక్కువకు తెలుసని... ఈ విషయాన్ని ఆయన గ్రహించాలని చెప్పారు. పశ్చిమబెంగాల్ నే బీజేపీ కొట్టబోతోందని... కేసీఆర్ తమకు ఒక లెక్క కాదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకంటే బురదలో పందులు మేలని దుయ్యబట్టారు.