Pawan Kalyan: వీటన్నింటికీ జగన్ సమాధానం చెప్పాలి: పవన్ కల్యాణ్
- ఏలూరులో వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది
- కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారు వేరే ఊళ్లకు వెళ్తున్నారు
- కనీసం న్యూరాలజిస్టును కూడా పిలిపించలేదు
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటి వరకు 500 మందికి పైగా దీని బారిన పడ్డారని... వీరిలో దాదాపు 470 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు ఆసుపత్రి వర్గాలు చెపుతున్నదాన్ని బట్టి అర్థమవుతోందని చెప్పారు.
ప్రజలు ఆందోళనతో గడుపుతున్నారని... కొన్ని ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు వేరే ఊళ్లకు వెళ్తున్నారని... దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. బాధితులకు చిన్నచిన్న వసతులను ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు.
చిన్న పిల్లలకు ఐసీయూ లేకపోవడం, అంతుచిక్కని వ్యాధి రోగులకు ప్రత్యేక ఐసొలేషన్ వార్డు లేకపోవడం, సాధారణ వార్డుల్లోనే చికిత్స అందించడం, జిల్లా కేంద్రంలో ఉన్న 500 పడకల ఆసుపత్రిలో న్యూరోఫిజీషియన్ లేకపోవడం వంటి విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయని పవన్ అన్నారు.
బాధితులకు ఫిట్స్ వస్తున్నప్పుడు కనీసం విజయవాడ నుంచైనా న్యూరాలజిస్టులను పిలిపించాల్సిన బాధ్యత లేదా? అని మండిపడ్డారు. కలుషిత నీరు కూడా దీనికి కారణమై ఉండొచ్చని చెబుతున్న తరుణంలో... ట్యాంకర్ల ద్వారానైనా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసి ఉండొచ్చు కదా అని విమర్శించారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.