cji: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే తల్లిని మోసం చేసి.. 2.5 కోట్లు కాజేసిన కేర్‌టేకర్
- నాగ్‌పూర్‌లో బోబ్డే కుటుంబానికి ఫంక్షన్ హాల్
- సీజేఐ తల్లి ముక్తా బోబ్డే పేరు మీద ఆ ఆస్తి
- దానికి పదేళ్లుగా కేర్‌టేకర్ ఉద్యోగంలో తపస్ ఘోష్
- అద్దెను కొన్నేళ్లుగా కాజేస్తోన్న వైనం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే తల్లి ముక్తా బోబ్డేను ఓ వ్యక్తి దాదాపు 2.5 కోట్ల రూపాయల మేర మోసం చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఆకాశవాణి కేంద్రం సమీపంలో బోబ్డే కుటుంబానికి ఒక పంక్షన్ హాల్ ఉంది. అది ముక్తా బోబ్డే పేరు మీద ఉంది. దానికి పదేళ్లుగా తపస్ ఘోష్ (47) అనే వ్యక్తి కేర్‌టేకర్‌గా వ్యవహరిస్తున్నాడు.
దానికి వచ్చే అద్దెను ఆయన బోబ్డే కుటుంబానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. అయితే, ముక్తా బోబ్డే వృద్ధాప్యం, ఆమె అనారోగ్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ఆమెకు అతడు తప్పుడు లెక్కలు చెబుతూ ఏళ్ల తరబడి డబ్బులు కాజేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఫంక్షన్ హాల్‌కు భారీగా బుకింగ్ లు వచ్చి, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.
దీంతో, డబ్బులు చెల్లించిన వారికి తిరిగి ఇవ్వడంలో తపస్ ఘోష్ జాప్యం చేశాడు. దీంతో ఫిర్యాదులు రావడంతో అతడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లెక్కల్లో తేడాలొచ్చాయని గుర్తించిన ముక్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఘోష్‌ను అరెస్టు చేశారు. ఈ నెల 16 వరకు రిమాండ్‌కు తరలించారు. సీజేఐ బోబ్డే తల్లిని ఫ్యామిలీ కేర్ టేకర్ మోసం చేశాడన్న కేసులో విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది.