KCR: నా పేరు కాపాడాడు... మేనల్లుడిపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్
- సిద్ధిపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభించిన సీఎం కేసీఆర్
- గతంలో సిద్ధిపేట ఎమ్మెల్యేగా వ్యవహరించిన కేసీఆర్
- ఎంపీగా కొనసాగాల్సి ఉండడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా
- సిద్ధిపేట నుంచి వెళుతూ ఆణిముత్యాన్ని ఇచ్చానని వెల్లడి
- హరీశ్ సిద్ధిపేటను అద్భుతంగా మార్చాడని కితాబు
సిద్ధిపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తెలంగాణ సాధన కోసం ఎంపీగా కొనసాగాల్సి ఉండడంతో ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో తీవ్రంగా విలపించానని వెల్లడించారు.
అయితే ఇక్కడ్నించి వెళ్లేటప్పుడు ఆణిముత్యంలాంటి నాయకుడ్ని ఇచ్చానని తన మేనల్లుడు హరీశ్ రావుపై ప్రశంసలు కురిపించారు. హరీశ్ రావు తన పేరు నిలబెట్టాడని, సిద్ధిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అద్భుతాన్ని ఆవిష్కరింపజేశాడని కొనియాడారు. తాను సిద్ధిపేటను వీడాల్సి వచ్చినా హరీశ్ రావు చేసిన అభివృద్ధి తన గుండెల నిండా సంతోషాన్ని నింపిందని వెల్లడించారు.
గతంలో సిద్ధిపేట ప్రజలు చుక్కనీటి కోసం ఎంతో ఇబ్బంది పడ్డారని, కానీ ఇప్పుడు సిద్ధిపేటలో అమలు చేస్తున్న మంచినీటి విధానమే రాష్ట్రమంతా మిషన్ భగీరథ పేరుతో అమలవుతోందని అన్నారు. అంతేకాకుండా, తెలంగాణ ఉద్యమానికి సిద్ధిపేటకు అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. సిద్ధిపేట పేరులోనే ఏదో బలముందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసిన గడ్డ సిద్ధిపేట అని అభివర్ణించారు. సిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అంటూ భావోద్వేగభరితంగా వ్యాఖ్యానించారు.