Dark Web: డార్క్ వెబ్ లో 70 లక్షల మంది క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు లీక్
- భారీ సైబర్ కుంభకోణం లీక్
- పలు సంస్థల ఉద్యోగుల వివరాలు బహిర్గతం
- వివరాలు తెలిపిన సైబర్ సెక్యూరిటీ నిపుణుడు
- థర్డ్ పార్టీ సంస్థలు లీక్ చేసి ఉంటాయని వెల్లడి
- డార్క్ వెబ్ లోని ఫోరంలు ఈ డేటా ప్రదర్శిస్తున్నాయని వివరణ
మరో అతిపెద్ద సైబర్ కుంభకోణం వెల్లడైంది. డార్క్ వెబ్ లో 70 లక్షల మంది క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు లీకైనట్టు తెలిసింది. లీకైన వివరాలన్నీ భారతీయులకు సంబంధించినవేనని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్ రజారియా వెల్లడించారు. యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, అకౌంట్ డీటెయిల్స్, ఆదాయ వివరాలు అన్నీ డార్క్ వెబ్ లో ప్రత్యక్షమయ్యాయని రజారియా పేర్కొన్నారు. ప్రధానంగా యాక్సిస్ బ్యాంకు, మెకిన్సే అండ్ కంపెనీ, బీహెచ్ఈఎల్, కెల్లాగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు సంబంధించిన డేటా లీకైన సమాచారంలో ఉందని తెలిపారు.
క్రెడిట్, డెబిట్ కార్డులను విక్రయించేందుకు బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్న థర్డ్ పార్టీ సంస్థలు ఈ సమాచారాన్ని డార్క్ వెబ్ లో లీక్ చేసి ఉండొచ్చని రజారియా వెల్లడించారు. డార్క్ వెబ్ లోని కొన్ని ఫోరంలు ఈ డేటాను ప్రదర్శిస్తున్నట్టు వివరించారు. క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన ఈ డేటాను ఆన్ లైన్ మోసాలకు వాడుకునే అవకాశం ఉందని తెలిపారు.