Silence: ఈ చాంబర్ లోకి వెళితే మన గుండె చప్పుడు మనకే భయంకరంగా వినిపిస్తుంది!
- అమెరికాలో ఏర్పాటైన ఒర్ఫీల్డ్ సౌండ్ ల్యాబ్స్
- సంగీత పరికరాల నాణ్యత పరిశీలించేందుకు ల్యాబ్ వినియోగం
- అంతరిక్ష నిశ్శబ్దాన్ని భరించేలా వ్యోమగాములకు శిక్షణ
- శరీరంలో కీలక అవయవాల చప్పుడు కూడా వినిపించే ల్యాబ్
- ఒర్ఫీల్డ్ ల్యాబ్స్ ను మించిన నిశ్శబ్ద చాంబర్ నిర్మించిన మైక్రోసాఫ్ట్
చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం అని మనం చదువుకుంటుంటాం! అయితే, మన గుండె చప్పుడు మాత్రమే కాదు, శరీరంలోపలి ఇతర అవయవాలు చేసే ధ్వనులు సైతం వినిపించేంత భయంకరమైన నిశ్శబ్దం గురించి తెలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి తీవ్ర నిశ్శబ్దమైన ప్రాంతం అమెరికాలోని మినియాపొలిస్ లో ఉంది. ఒర్ఫీల్డ్ ల్యాబొరేటరీస్ అనే సౌండ్ డిజైన్ స్టూడియోలోని ఓ చాంబర్ లో ఈ నిశ్శబ్దం కొలువై ఉంటుందట.
అనేక ప్రముఖ ఆడియో సంస్థలు తయారుచేసే పరికరాల నాణ్యతను పరిశీలించడానికి ఈ చాంబర్ ను వినియోగిస్తారు. అంతరిక్షంలోని నిశ్శబ్దాన్ని తట్టుకోవడానికి వ్యోమగాములు సైతం ఈ చాంబర్ లోనే శిక్షణ పొందుతారు. ఈ చాంబర్ లో ఏర్పాటు చేసిన గోడలు వెలుపలి శబ్దాలను ఏమాత్రం బయటికి రానివ్వవు. చాంబర్ లోపల శబ్దస్థాయిని -9.4 డెసిబుల్స్ కు పరిమితం చేస్తారు.
దాంతో ఈ చాంబర్ లోకి వెళితే బయటి శబ్దాలు ఏమాత్రం వినిపించకపోగా, అత్యంత తీవ్రమైన నిశ్శబ్దంలో మన శరీరంలోని అవయవాలు చేసే చప్పుళ్లు స్పష్టంగా వినిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీర అవయవాల కదలికల నుంచి వినిపించే ధ్వనులే భయంకరంగా ఉంటాయని, వీటిని 45 నిమిషాలకు మించి భరించడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు.
అయితే, ఒర్ఫీల్డ్ ల్యాబొరేటరీస్ ను మించిన నిశ్శబ్దంతో మైక్రోసాఫ్ట్ సంస్థ సొంతంగా ఓ ల్యాబ్ ను నిర్మించుకుంది. అంతేకాదు, ఒర్ఫీల్డ్ ల్యాబ్స్ రికార్డును తెరమరుగు చేస్తూ గిన్నిస్ రికార్డు సాధించింది.