Kerala: పోలింగ్ కేంద్రంలో సందడి చేసిన రోబో.. ఓటర్ల శరీర ఉష్ణోగ్రత చెక్ చేసి, శానిటైజర్ ఇచ్చిన వైనం!
- కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగంలోకి రోబో
- ప్రయోగాత్మకంగా సేవలు అందుబాటులోకి
- కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు
కేరళలోని ఎర్నాకుళం జిల్లా త్రికక్కర్ మునిసిపల్ పోలింగ్ కేంద్రంలో రోబోలు సందడి చేశాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వారికి సేవలు అందించాయి. పోలింగ్ కేంద్రంలో వారు అడుగుపెట్టగానే ‘సయాబోట్’ అనే రోబో వారి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసింది. అనంతరం వారికి శానిటైజర్ ఇచ్చి లోపలికి పంపింది. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు ఈ రోబో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు ఈ రోబోలను రంగంలోకి దింపారు.
ఓటరు శరీర ఉష్ణోగ్రత అనుమానాస్పదంగా ఉంటే హెచ్చరించి పోలింగ్ అధికారిని సంప్రదించాల్సిందిగా సలహా ఇచ్చింది. అలాగే, ఫేస్మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. పోలింగ్ కేంద్రంలో రోబో సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించినట్టు ఎర్నాకుళం కలెక్టర్ ఎస్ సుహాస్ తెలిపారు. ఇతర పోలింగ్ కేంద్రాలలో కూడా వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.