Satyendra Jain: కరోనా మూడో దశ పడగ కిందే హస్తిన: హెచ్చరించిన సత్యేంద్ర జైన్
- నవంబర్ 1 తరువాత అతి తక్కువ కేసులు
- మూడో దశ తొలగిపోతున్నదన్న సత్యేంద్ర జైన్
- ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని వినతి
దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా మూడో వేవ్ ఇంకా పూర్తిగా పోలేదని, ఇప్పటికే మహమ్మారి పడగ నీడనే నగరం ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ హెచ్చరించారు. అయితే మూడో దశ క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నవంబర్ 1 తరువాత బుధవారం నాడు ఢిల్లీలో అతి తక్కువగా 2,463 కొత్త కేసులు రాగా, 50 మంది మరణించారు.
ఇదే విషయాన్ని గుర్తు చేసిన సత్యేంద్ర జైన్, నమూనాల పరీక్షల సంఖ్యతో పోలిస్తే పాజిటివిటీ రేటు 3.42 శాతానికి పడిపోయిందని ట్వీట్ చేసిన ఆయన, అతి త్వరలోనే దేశ రాజధాని కరోనాపై చేస్తున్న పోరాటంలో విజయం సాధించనుందని అన్నారు. "కేసుల సంఖ్య తగ్గుతోంది. గత 40 రోజుల్లోనే మరణాల సంఖ్య అతి తక్కువ స్థాయికి పడిపోయింది. మూడో దశ కరోనా వేవ్ క్రమంగా సమసిపోతోందని కచ్చితంగా చెప్పగలను" అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు.
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై స్పందించిన ఆయన, తొలి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు టీకాను ఇస్తామని, ఆపై వృద్ధులకు ఇతరులకు పంచుతామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కు ఉన్నతాధికారుల నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నామని తెలిపిన ఆయన, అనుమతి రాగానే, ఢిల్లీలోని ప్రతి ఒక్కరికీ టీకాను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఐసీయూ బెడ్స్ కొరతగా ఉందన్న విషయమై మీడియా ప్రశ్నించగా, ఈ సమస్యను రాత్రికి రాత్రే పరిష్కరించలేమని, కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగితే కొంత సమస్య వస్తోందని, దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
ప్రస్తుతం దేశంలోని ఏ నగరంలోనూ లేనన్ని బెడ్లు ఢిల్లీలో ఉన్నాయని తెలిపిన ఆయన, ప్రస్తుతం 2,500 ఐసీయూ బెడ్లు సహా 13 వేల బెడ్లు వివిధ ఆసుపత్రుల్లో ఉన్నాయని తెలిపారు. తమకు వ్యాక్సిన్ కావాలని ఇప్పటివరకూ 2 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.