Amaravati: అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో.. రైతుల ఆరు రోజుల ప్రణాళిక
- రేపు గుంటూరులో మహా పాదయాత్ర
- 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనం
- 15న విజయవాడలో రాజధాని పరిరక్షణ పాదయాత్ర
- 17న ఉద్ధండరాయునిపాలెంలో బహిరంగ సభ
అమరావతి రాజధాని రైతులు కొనసాగిస్తోన్న ఉద్యమం ఈ నెల 17తో ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజకీయేతర ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక వేసుకుంది. రేపటి నుంచి ఆరు రోజుల పాటు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకుంది.
తొలి రోజయిన రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరులో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 15న విజయవాడలో రాజధాని పరిరక్షణ పాదయాత్రను చేస్తారు. చివరిరోజయిన ఈ నెల 17న ఉద్ధండరాయునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 13, 16న కూడా నిరసనలు తెలుపుతారు. తమ ఉద్యమం ఇక్కడితో ఆగిపోదని, అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే వరకు కొనసాగిస్తూనే ఉంటామని ఐకాస నేతలు స్పష్టం చేశారు.