Rahul Gandhi: రైతులందరూ పంజాబ్ రైతుల్లా ఆదాయం పెంచుకోవాలనుకుంటుంటే, వారిని బీహార్ రైతుల్లా మార్చాలనుకుంటున్నారు: రాహుల్ గాంధీ
- రైతుల ఆదాయంపై జాతీయ మీడియాలో కథనం
- పంజాబ్ రైతుకు సగటున ఏడాదికి రూ.2.16 లక్షల ఆదాయం
- బీహార్ రైతుకు రూ.42 వేల ఆదాయం
- స్పందించిన రాహుల్ గాంధీ
- మోదీ సర్కారు బీహార్ రైతు ఆదాయం చాలనుకుంటోందని వ్యాఖ్యలు
దేశంలోని రైతుల ఆదాయం గురించి బిజినెస్ టుడే మీడియా సంస్థలో వచ్చిన ఓ కథనంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. బిజినెస్ టుడే కథనం ప్రకారం పంజాబ్ రైతు సాలీనా సగటున రూ.2.16 లక్షలు ఆర్జిస్తుండగా, అత్యల్పంగా బీహార్ రైతు రూ.42 వేలతో సరిపెట్టుకుంటున్నాడు.
దీనిపై రాహుల్ వ్యాఖ్యానిస్తూ, దేశంలోని రైతులందరూ పంజాబ్ రైతుల్లా ఆదాయం పెంచుకోవాలని కోరుకుంటుంటే, మోదీ సర్కారు మాత్రం వారిని బీహార్ రైతుల్లా మారాలని కోరుకుంటోందని విమర్శించారు. బీహార్ రైతులకు ఎంత ఆదాయం వస్తుందో అంతే ఆదాయం చాలని కేంద్రం భావిస్తోందని రాహుల్ మండిపడ్డారు. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన జాతీయ వ్యవసాయ చట్టాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.