Srilakshmi: ఎట్టకేలకు తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి మారిన ఐఏఎస్ శ్రీలక్ష్మి
- ఓబుళాపురం గనుల కేసులో అరెస్టయిన శ్రీలక్ష్మి
- రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ క్యాడర్ కు శ్రీలక్ష్మి
- డిప్యుటేషన్ కోసం ప్రయత్నించిన వైనం
- కేంద్రం తిరస్కరణ
- క్యాట్ ను ఆశ్రయించి అనుకున్నది సాధించిన అధికారిణి
- నిన్న ఏపీ జీఏడీలో రిపోర్టు
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. 1988 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కేసులో జైలు జీవితం గడిపారు. అప్పట్లో ఆమె అరెస్ట్ కావడంతో విధుల నుంచి సస్పెండ్ చేశారు. తదనంతర కాలంలో ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయగా, తెలంగాణ క్యాడర్ లో కొనసాగుతున్నారు.
కొంతకాలంగా ఆమె తన క్యాడర్ మార్చాలంటూ తీవ్ర ప్రయత్నాలు చేయగా, ఎట్టకేలకు విజయం వరించింది. శ్రీలక్ష్మిని ఏపీకి బదలాయిస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాల మేరకు శ్రీలక్ష్మిని తెలంగాణ ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేసింది. ఈ క్రమంలో నిన్న ఆమె అమరావతిలో ఏపీ సచివాలయం జీఏడీలో రిపోర్టు చేశారు.
శ్రీలక్ష్మి స్వస్థలం విశాఖపట్నం జిల్లా. ఆమె తండ్రి ఓ రైల్వే అధికారి కావడంతో వారి కుటుంబం తెలంగాణకు వెళ్లింది. ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చిరునామా ఆధారంగా శ్రీలక్ష్మిని తెలంగాణ క్యాడర్ కు కేటాయించారు. ఈ విషయాలనే ఆమె క్యాట్ కు తెలియజేయగా, ఆమెను ఏపీకి మార్చేందుకు క్యాట్ అంగీకరించింది.
కాగా, గతంలో ఆమె డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులను ఇతర రాష్ట్రాలకు డిప్యుటేషన్ పై పంపడం వీలుకాకపోవడంతో కేంద్రం ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.