Madhu Yaskhi: బీజేపీకి కేసీఆర్ మేయర్ పదవిని ఆఫర్ చేశారనే ప్రచారం జరుగుతోంది: మధు యాష్కి
- కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాళ్ల బేరానికి దిగుతున్నారు
- సింగిల్ గా అమిత్ షాను కలవడంలో అర్థం ఏమిటి?
- కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం యత్నిస్తున్నాయి
హైదరాబాదులో ఉన్నప్పుడు బీజేపీని విమర్శించే ముఖ్యమంత్రి కేసీఆర్... ఢిల్లీకి వెళ్లి కాళ్ల బేరానికి దిగుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ దుయ్యబట్టారు. దేవుడినైనా ఎదిరిస్తానంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్... ఢిల్లీ టూర్ లో బీజేపీ నేతల ముందు సాగిలపడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారులెవరూ లేకుండానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేసీఆర్ కలిశారని... ఈ భేటీ వెనకున్న అర్థం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
బీజేపీకి హైదరాబాద్ మేయర్ పదవిని కేసీఆర్ ఆఫర్ చేశారనే ప్రచారం జరుగుతోందని మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూకబ్జా కేసు నమోదైన మంత్రి మల్లారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలకు పాల్పడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకపోతే ప్రజలే కేసీఆర్ గడీలను పగలగొడతారని చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గం అలీబాబా నలభై దొంగల మాదిరి తయారైందని అన్నారు.