Corona Virus: అమెరికాలో నేటి నుంచి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ
- ఫైజర్ ప్లాంట్ నుంచి వ్యాక్సిన్లతో బయలుదేరిన ట్రక్కులు
- 145 కేంద్రాలకు వ్యాక్సిన్ల సరఫరా
- మూడు వారాల తర్వాత రెండో డోసు
కరోనాతో అల్లాడిపోతున్న అమెరికా ప్రజలకు ఇది గొప్ప ఊరట. నేటి నుంచి అక్కడ కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు పంపిణీ చేయనున్నారు. అత్యవసర వినియోగానికి ఫైజర్ టీకాకు అనుమతి లభించడంతో మిచిగన్‌లోని ఫైజర్ అతిపెద్ద ప్లాంట్ నుంచి వ్యాక్సిన్ల లోడ్లతో ఫెడెక్స్ ట్రక్కులు బయలుదేరాయి.
ఇవి 145 టీకా కేంద్రాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నాయి. కొవిడ్ టీకాను మైనస్ 94 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో టీకాలు సరఫరా చేస్తున్న బాక్సుల్లో ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాటిలో జీపీఎస్ పరికరాలను అమర్చారు.
తొలి విడతలో 30 లక్షల మందికి టీకాను పంపిణీ చేయనుండగా, తొలుత క్రిటికల్ కేర్ యూనిట్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, నర్సింగ్ హోంలలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇస్తారు. తొలి టీకా ఇచ్చిన మూడు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు.