Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణం.. భారీ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్న ట్రస్టు
- స్వచ్ఛంద విరాళాల సేకరణకు సిద్ధమవుతున్న ట్రస్టు
- రామ భక్తులందరూ భాగస్వాములు కావాలని విన్నపం
- రూ. 10, 100, 1000 కూపన్ల రూపంలో విరాళాల సేకరణ
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం జరిగింది. మందిర నిర్మాణానికి సంబంధించి త్వరలోనే భక్తుల నుంచి విరాళాలను సేకరించనున్నారు. దీనికి సంబంధించి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రకటనను వెలువరించింది. రామజన్మభూమి ఉద్యమం గురించి అందరికీ తెలిసేలా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించింది. ఒక ఉద్యమంలా ప్రజల్లోకి వెళ్లనున్నట్టు చెప్పింది
రామ జన్మభూమి ఉద్యమంలో కోట్లాది మంది భక్తులు పాలుపంచుకున్నారని ట్రస్టు తెలిపింది. అదే విధంగా రామభక్తులు ఇచ్చే స్వచ్ఛంద విరాళాలతో మందిర నిర్మాణం జరుగుతుందని చెప్పింది. విరాళాల సేకరణ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా చేపడతామని తెలిపింది. దీనికి సంబంధించి క్యాంపెయిన్ చేపట్టనున్నామని, ఈ క్యాంపెయిన్ ద్వారా ఆలయ నమూనా ఫొటో కోట్లాది కుటుంబాలకు చేరుతుందని చెప్పింది.
రూ. 10, 100, మరియు 1000 విలువైన కూపన్ల ద్వారా విరాళాలను సేకరిస్తామని చెప్పింది. మకర సంక్రాంతి రోజన ఈ క్యాంపెయిన్ ను ప్రారంభిస్తామని... మాఘ పౌర్ణమి వరకు అది కొనసాగుతుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో రామ భక్తులందరూ భాగస్వాములు కావాలని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోరింది.