BSF: సరిహద్దు వెంట 11 గంటల్లో 180 కిలోమీటర్లు పరిగెత్తిన జవాన్లు... వీడియో విడుదల!
- విజయ్ దివస్ సందర్భంగా ప్రత్యేక ర్యాలీ
- భాగం పంచుకున్న 930 మంది బీఎస్ఎఫ్ జవాన్లు
- వీడియో పోస్ట్ చేసిన కిరణ్ రిజిజు
1971లో దేశం కోసం ప్రాణాలర్పించి అమరులైన జవాన్ల గౌరవార్థం, బీఎస్ఎఫ్ జవాన్లు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా కేవలం 11 గంటల వ్యవధిలోనే జవాన్లు 180 కిలోమీటర్ల దూరాన్ని పరిగెత్తారు. మొత్తం 930 మంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు ఇందులో పాల్గొనగా, ఈ వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. సరిహద్దుల వెంట ఒక్కో జవాను 400 నుంచి 500 మీటర్ల దూరం పరిగెడుతుండగా, వారిని ఉత్సాహపరుస్తూ, దేశ భక్తి పాటలను వినిపిస్తూ ఈ ర్యాలీ సాగింది.
రాజస్థాన్ లోని బికనేర్ సమీపంలో ప్రారంభమైన ఈ రన్నింగ్ ర్యాలీ, అనూప్ గఢ్ లో ముగిసింది. 1971లో పాకిస్థాన్ పై యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా, డిసెంబర్ 16న విజయ్ దివస్ నిర్వహిస్తారు. పాక్ ఓటమి తరువాతే తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా మారింది.