Bandi Sanjay: తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమిస్తాం: బండి సంజయ్
- అగ్ర వర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్ట బద్ధ నిర్ణయం
- వివిధ రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లు అమలు
- తెలంగాణలో మాత్రం రిజర్వేషన్లు అమలు కావట్లేదు
- అగ్ర వర్ణ పేదలకు అన్యాయం జరుగుతోందన్న సంజయ్
అగ్ర వర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ, కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ధ నిర్ణయం తీసుకోగా వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అయితే, తెలంగాణలో మాత్రం రిజర్వేషన్లు అమలు కాకపోవడం పట్ల వేలాది మంది అగ్ర వర్ణాల పేదలకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుపై త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రవర్ణ పేదల వ్యతిరేకి అని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు అమలు చేయరు? అని ఆయన నిలదీశారు.
‘పేద ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎందుకింత కక్ష? అగ్ర వర్ణ పేదలు పైకి రాకుండా అణగదొక్కేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నడు. అగ్రవర్ణ పెద్దలకు మాత్రం పదవులు ఇస్తూ, పేదలకు మొండిచెయ్యి చూపుతూ కటిక దరిద్రంలోకి నెడుతున్నారు’ అని బండి సంజయ్ విమర్శించారు.
‘కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టబద్ధంగా కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయకపోవడంవల్ల ఇప్పటి వరకు దాదాపు 65 వేల మంది పేద ఓసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుకు మద్దతివ్వాలని కోరుతూ రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్ట శ్రీనివాసరెడ్డి, అర్యవైశ్య చైతన్య పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ గార్లు పలువురు ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. అందుకోసం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి వెనకాడబోము అని వారికి స్పష్టం చేశాను’ అని బండి సంజయ్ ప్రకటించారు.