petition: ‘ఆదిపురుష్’పై వ్యాఖ్యలు.. నటుడు సైఫ్ అలీఖాన్ పై కోర్టులో న్యాయవాది పిటిషన్
- ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'
- సినిమా కథ గురించి సైఫ్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమేనని వ్యాఖ్య
- అభ్యంతరాలు తెలుపుతూ న్యాయవాది పిటిషన్
ప్రభాస్ తదుపరి సినిమాగా 'ఆదిపురుష్' తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమా కథ గురించి సైఫ్ అలీఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ సినిమాలో ఆయన రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమేనని, రావణుడిలో ఉన్న మానవీయ కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నామని సైఫ్ వ్యాఖ్యానించాడు.
అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే సైఫ్ అలీఖాన్ క్షమాపణలు చెప్పాడు. ఈ క్రమంలో ఆయనపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది జౌన్‌పూర్ కోర్టులో ఈ పిటిషన్ వేస్తూ, రావణుడిపై సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలిపారు. దర్శకుడు ఓం రౌత్ పేరును కూడా ఆయన తన పిటిషన్ లో ప్రస్తావించారు.