Somireddy Chandra Mohan Reddy: ఇటు సీఎం, అటు ప్రధాని మంచి మనసు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా: సోమిరెడ్డి
- అమరావతి రైతులు, మహిళలు 365 రోజులుగా పోరాటం చేస్తున్నారు
- అయినప్పటికీ జగన్ మనసు కరగడం లేదు
- కేంద్రంలోనూ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారు
- మంచి నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు క్షమించరు
అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు 365 రోజులుగా పోరాటం చేస్తున్నారని, ఇంత పోరాటం చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ మనసు కరగడం లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా మొండిగా ముందుకు వెళ్లకుండా అమరావతి రాజధానిపై మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జగన్ మంచి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని, సిక్కు మత గురువు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోదీ ఇటువంటి పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నారని ఆయన ప్రశ్నించారు.
రైతులకు అనుకూలంగా ప్రకటన చేయాల్సిన బాధ్యత మోదీకి ఉందని చెప్పారు. అలాగే, ఇక్కడ అమరావతి రాజధాని విషయంలోనూ, రైతుల విషయంలో ఇటు సీఎం జగన్, అటు ప్రధాని నరేంద్ర మోదీ మంచి మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని, లేదంటే ప్రజలు క్షమించరని అన్నారు.