Sonu Sood: ఇంకా ఎన్ని రోజులు వారిని ఇలా చూడాలి?.. రైతుల ఆందోళనపై నటుడు సోనూ సూద్ ఆవేదన
- సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో చర్చలో పాల్గొన్న సోనూ సూద్
- ప్రేమగా చెబితే రైతులు వింటారన్న నటుడు
- పొలంలో ఉండాల్సిన రైతులు చలిలో వణుకుతున్నారంటూ విచారం
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందించాడు. ఇంకా ఎన్నాళ్లు వారిని ఇలాంటి పరిస్థితుల్లో చూడాలని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘వియ్ ది వుమెన్’ పేరుతో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో చర్చలో పాల్గొన్న సోను రైతుల ఉద్యమంపై స్పందించాడు. రైతుల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. వారి దుస్థితి తనను కలచివేస్తోందన్న సోను.. రైతుల విషయంలో తప్పెవరిది? అన్న వాదనకు తాను దిగబోనని, వారి సమస్యలు పరిష్కారం కావాలన్నదే తన కోరిక అని పేర్కొన్నాడు.
తాను పుట్టి పెరిగింది పంజాబ్‌లోనేనని, రైతులతో తనకు చాలా అనుబంధం ఉందని అన్నాడు. ఈ పోరులో కొందరు రైతులు మరణించడం బాధాకరమన్నాడు. ప్రేమగా చెబితే రైతులు వింటారని సోను చెప్పుకొచ్చాడు. పొలాల్లో విత్తనాలు నాటుతూ ఉండాల్సిన రైతులు పిల్లాపాపలతో రోడ్లపైన చలిలో వణుకుతున్నారని, వీరిని ఇలా ఇంకెన్ని రోజులు చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశాడు.