Sonia Gandhi: థాకరేకు సోనియా రాసిన లేఖపై వివరణ ఇచ్చిన శివసేన

No Pressure Politics says Siv Sena on Sonias letter toThackeray

  • లేఖ వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు
  • కామన్ మినిమం ప్రోగ్రామ్ ను సంకీర్ణ ప్రభుత్వం రూపొందించుకుంది
  • కాంగ్రెస్ ఎలాంటి సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం

మహారాష్ట్రలో సాధారణ కనీస కార్యక్రమం (కామన్ మినిమం ప్రోగ్రామ్)ను అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభాలో వారి శాతానికి తగ్గట్టుగా నిధులను కేటాయించాలని సూచించారు.

అలాగే, వీరికి సంబంధించిన బ్యాక్ లాగ్ పోస్టులను వేగంగా భర్తీ చేసేందుకు కాల పరిమితితో కూడిన రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను అదే ఆర్థిక సంవత్సరంలో వినియోగించేలా శాసనసభ ఆమోదం తెలపాలని అన్నారు. ఈ లేఖపై రాజకీయ చర్చ ప్రారంభమైంది. ఉద్ధవ్ పై సోనియాగాంధీ ఒత్తిడి పెంచుతున్నారనే చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు మాట్లాడుతూ, సోనియా రాసిన లేఖ వెనుక ఎలాంటి ఒత్తిడి రాజకీయాలు లేవని చెప్పారు. సోనియా గాంధీ యూపీఏ ఛైర్ పర్సన్ అని... మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సోనియా, శరద్ పవార్ లు కీలక పాత్రను పోషించారని అన్నారు.

సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా తాము కామన్ మినిమం ప్రోగ్రాన్ ను రూపొందించుకున్నామని సంజయ్ రౌత్ చెప్పారు. అయితే కరోనా వల్ల ప్రభుత్వంపై పని భారం ఎక్కువైందని... దీంతో, కొన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండిపోయాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఉన్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చినా తాము తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. తాము కాంగ్రెస్ పార్టీ భాగస్వాములమని అన్నారు.

  • Loading...

More Telugu News