Rahul Gandhi: కేంద్రం నిద్రపోతుంటే చైనా ఎంతో శ్రద్ధగా తన పని తాను చేసుకుపోతోంది: రాహుల్ గాంధీ
- సరిహద్దుల్లో చైనా కార్యకలాపాలు తీవ్రం
- మీడియాలో కథనాలు
- వాస్తవాధీన రేఖ వెంబడి రోడ్లు, స్థావరాల నిర్మాణం
- తాను ఎప్పట్నించో హెచ్చరిస్తున్నానన్న రాహుల్
- సకాలంలో చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
భారత్ మొద్దు నిద్ర పోతుంటే సరిహద్దుల్లో చైనా ఎంతో శ్రద్ధగా తన పని తాను చేసుకుంటూ పోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కారకోరమ్ పాస్, అక్సాయ్ చిన్ ప్రాంతాల్లో చైనా భారీ ఎత్తున రోడ్లు, కీలక స్థావరాలు నిర్మిస్తోందని మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని ఉటంకిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కార్యకలాపాలు ఉద్ధృతం అయ్యాయని, గోల్ ముద్ ప్రాంతంలో సరకు రవాణా డిపో నిర్మిస్తోందని, అక్కడే భూగర్భంలో పెట్రోలియం, చమురు నిల్వకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.... చైనా చర్యలపై తాను నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నానని అన్నారు. దీనిపై సత్వరమే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని, దేశ భద్రత రీత్యా అది తప్పనిసరి అని స్పష్టం చేశారు.