Farmers: 'శ్రద్ధాంజలి దివస్' సందర్భంగా నరేంద్ర మోదీకి రైతుల బహిరంగ లేఖ!

Open Letter to Narendra Modi from Farmers

  • మూడు వారాలకు పైగా రైతుల నిరసనలు
  • పంజాబ్, యూపీ రైతులకు సంఘీభావంగా వస్తున్న హర్యానా రైతులు
  • నిరసనల వెనుక విపక్ష పార్టీలు లేవు
  • వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే కోరుతున్నాం
  • మోదీ, తోమర్ లకు రైతుల లేఖ

గడచిన మూడు వారాలకు పైగా దేశ రాజధానిలో తాము నిరసన తెలిపేందుకు అనుమతించాలంటూ సరిహద్దులను దిగ్బంధించి, ధర్నాలు చేస్తున్న ఉత్తరాది రాష్ట్రాల రైతులు, నిరసనల్లో మరణించిన తమ సహచరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన వేళ, ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖను రాశారు. తమ నిరసనల వెనుక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, తాము కేవలం రైతులపై ఆంక్షలు పెట్టేలా ఉన్న చట్టాలు వద్దని మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశారు.

నేడు జరపతలపెట్టిన శ్రద్ధాంజలి దివస్, దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సాగుతుందని స్పష్టం చేసిన ఆయన, ప్రస్తుత ప్రతిష్ఠంభన తొలగాలంటే, చట్టాలను వెనక్కు తీసుకోవడం మినహా మరో మార్గం లేదని తమ లేఖలో వెల్లడించారు.

ఇదిలావుండగా, నిరసనలు తెలుపుతున్న పంజాబ్, యూపీ రైతులకు సంఘీభావంగా హర్యానా రైతులు కూడా సరిహద్దులకు వచ్చి చేరుతుండటంతో కేంద్రానికి మరో సమస్య మొదలైంది. ఈ విషయంలో రైతులను సముదాయించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. నేడు ఆయన తోమర్ ను కలిసి ప్రత్యేక చర్చలు జరపనున్నారు. హర్యానాలో రైతులకు సట్లెజ్ యుమునా కెనాల్ ద్వారా సాగునీరు ఇవ్వాలని ఆయన కోరనున్నారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు, ఎమ్ఎన్సీలకు అనుకూలంగా ఉన్నాయన్న భావన తొలగితేనే, రైతులు తమ ఆందోళనలను విరమిస్తారని అభిప్రాయపడుతున్న ఖట్టర్, అదే విషయాన్ని కేంద్రానికి తెలియజేయనున్నారు. రైతులతో అంశాల వారీగా చర్చించేందుకు సిద్ధమని కేంద్రం వెల్లడించిన వేళ, రైతులను తప్పుదారి పట్టించేందుకే ఈ మాటలు మాట్లాడుతున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.

  • Loading...

More Telugu News