DRDO: భారత అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం.. ఏటీఏజీఎస్ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో
- ఒడిశాలో పరీక్షించిన డీఆర్డీవో
- 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం
- భవిష్యత్తులో ఆర్మీలో కీలకంగా మారనున్న అత్యాధునిక గన్
భారత అమ్ములపొదిలో మరో అత్యాధునిక ఆయుధం వచ్చి చేరింది. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టం (ఏటీఏజీఎస్) అనే అత్యాధునిక ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది సులభంగా ఛేదించింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 2016లో ఏటీఏజీఎస్ తుపాకుల ప్రాజెక్టుకు డీఆర్డీవో శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు.
భారత్ ఫోర్జ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఆయుధాలను తయారుచేసే సామర్థ్యం భారత్కు ఉందని, ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మనకు లేదని ఈ ప్రాజెక్టు డైరెక్టర్ శైలేంద్ర పేర్కొన్నారు. ఏటీఏజీఎస్ తుపాకులు భవిష్యత్తులో భారత ఆర్మీలో కీలకంగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు.