Manthena Satyanarayana Raju: సముద్రం కంటే అవంతి చేసిన కబ్జాలే ఎక్కువ: టీడీపీ ఎమ్మెల్సీ మంతెన
- విశాఖలో కబ్జాలు చేసేది వైసీపీ నేతలేనన్న మంతెన
- అవంతి, విజయసాయి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
- తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెడుతున్నారని వెల్లడి
- కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. విశాఖలో కబ్జాలు చేసేది వైసీపీ నేతలేనని ఆరోపించారు. కానీ ప్రభుత్వం టీడీపీ నేతలపై కేసులు పెడుతోందని అన్నారు. విశాఖలో సముద్రం కంటే మంత్రి అవంతి చేసిన కబ్జాలే ఎక్కువని విమర్శించారు. మంత్రి అవంతి, విజయసాయి కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గీతం వర్సిటీని కూల్చారని, ఫ్యూజన్ హోటల్ ను ఖాళీ చేయించారని మంతెన వెల్లడించారు. కేసులు నమోదు చేస్తూ టీడీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
"వైసీపీ సర్కారు విశాఖలో టీడీపీ నేతల ఆస్తుల్ని లాగేసుకుంటూ వారిపైనే కేసులు నమోదు చేస్తోంది. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటుందా? అన్ని అనుమతులు ఉన్నా గానీ మాజీ ఎంపీ సబ్బం హరి ప్రహరీగోడ కూల్చేశారు. గీతం యూనివర్సిటీలోనూ ఇదే విధంగా వ్యవహరించారు. ఫ్యూజన్ హోటల్ కు కాలపరిమితి ఉన్నా అర్ధరాత్రి ఖాళీ చేయించారు" అని వివరించారు. వైసీపీలోకి వెళ్లేందుకు ఇష్టపడని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఇప్పుడు వేధింపులకు తెరలేపారని మంతెన ఆరోపించారు.