Nara Lokesh: ఒంగోలులో దివ్యాంగురాలిని సజీవదహనం చేస్తే సీఎం జగన్ కు స్పందించే సమయం లేదు: నారా లోకేశ్
- ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవదహనం
- జగన్ కు చిత్తశుద్ధి లేదన్న లోకేశ్
- జన్మదినోత్సవ భజన కార్యక్రమాలకు సమయం ఇస్తున్నారని వ్యాఖ్యలు
- పబ్లిసిటీ తప్ప ఒక్క మహిళకూ న్యాయం చెయ్యలేదని వెల్లడి
ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరిని అత్యంత దారుణంగా సజీవ దహనం చేస్తే స్పందించే హృదయం, సమయం సీఎం జగన్ కు లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. ఈ ఘటన ద్వారా మహిళల రక్షణ పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదనే విషయం మరోసారి బయటపడిందని తెలిపారు. జన్మదినోత్సవం అంటూ భజన కార్యక్రమాలకు ఇస్తున్నంత సమయం కూడా మహిళల రక్షణ చర్యలకు ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. 18 నెలల పాలనలో 310 ఘటనలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదని, ఒక్క మృగాడికి కూడా శిక్ష పడలేదని ఆరోపించారు. దిశ చట్టం పేరుతో పబ్లిసిటీ తప్ప ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా? అని లోకేశ్ ప్రశ్నించారు.
ఒంగోలులో భువనేశ్వరి సజీవదహనం ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని, నిజానిజాలను వెలికితీసి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భువనేశ్వరి కుటుంబాన్ని ఆదుకుని ప్రభుత్వం న్యాయం చెయ్యాలని స్పష్టం చేశారు.