WHO: బ్రిటన్ లో కరోనా వైరస్ రూపాంతరం చెందడంపై డబ్ల్యూహెచ్ఓ స్పందన
- బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్తరకం కరోనా
- జన్యు ఉత్పరివర్తనాలకు లోనైన వైరస్
- అతివేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తున్న వైనం
- కొత్తరకంపై మరింత సమాచారం రావాల్సి ఉందన్న డబ్ల్యూహెచ్ఓ
కరోనా వైరస్ జన్యు ఉత్పరివర్తనాలకు లోనై బ్రిటన్ లో కొత్త రూపు సంతరించుకుని అతివేగంగా వ్యాపిస్తుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. కరోనా వైరస్ రూపాంతరం చెందడంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, సమగ్ర సమాచారం వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
బ్రిటన్ లో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నామని, అక్కడి అధికారులు కొత్త రకం కరోనా వైరస్ పై జరుగుతున్న పరిశోధనలు, విశ్లేషణ వివరాలను తమతో పంచుకుంటున్నారని వెల్లడించింది. ఉత్పరివర్తనాలకు లోనైన కరోనా వైరస్ గురించి పూర్తి సమాచారం లభ్యమైన వెంటనే ప్రజలతో పంచుకుంటామని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రజలు ప్రభుత్వాల సూచనల మేరకు నడుచుకోవడం మేలని హితవు పలికింది. అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని పేర్కొంది.