Joe Biden: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జో బైడెన్.. భయమేమీ లేదంటూ భరోసా
- వ్యాక్సిన్ షాట్ తీసుకున్నాక నిపుణుల సలహా పాటించాలన్న బైడెన్
- మహమ్మారి నుంచి బయటపడేందుకు చాలా దూరం ప్రయాణించాలన్న జో
- ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోని ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా, కరోనా వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. స్వస్థలమైన డెలావర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వ్యాక్సిన్ వల్ల భయపడడానికి ఏమీ లేదన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిపుణుల సూచనలు పాటించాలని అన్నారు. వైరస్ నుంచి బయటపడడానికి ఇది ఆరంభం మాత్రమేనని, మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని బైడెన్ పేర్కొన్నారు.
కాగా, గతవారం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు కూడా వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మొదటి మహిళ మెలానియా ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదు. అమెరికాలో ఇటీవలే ఫైజర్ టీకా అందుబాటులోకి వచ్చింది. యూఎస్ రెగ్యులేటరీ ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.