Jammu And Kashmir: కుటుంబీకులు చెప్పారని లొంగిపోయిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు... కశ్మీర్ లో అనూహ్య ఘటన!
- కుల్గామ్ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం
- ఎన్ కౌంటర్ మొదలు కాగానే లొంగిపోయిన వైనం
- ఫిస్టల్స్, మందుగుండు స్వాధీనం
ఓ ఇంట్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాగున్నారని తెలుసుకున్న భారత జవాన్లు ఎన్ కౌంటర్ ప్రారంభించగా, ఉగ్రవాదుల కుటుంబీకులు వారికి నచ్చజెప్పడంతో వారు లొంగిపోయారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్ పరిధిలోని తొంగుడౌను ప్రాంతంలో జరిగింది. ఇది ఓ అనూహ్య ఘటనని కశ్మీర్ జోన్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని వివరాలను అధికారులు వెల్లడిస్తూ, ఇద్దరు ఉగ్రవాదులు కుల్గామ్ సమీపంలోని తొంగుడౌనులో దాగున్నారని తెలుసుకుని పోలీసులు, జవాన్లు ఆ ప్రాంతానికి వెళ్లారని తెలియజేశారు. ఆపై ఎన్ కౌంటర్ జరుగుతుండగా, తమ వారిని లొంగిపోవాలని కుటుంబీకులు కోరారని, దీంతో వారు లొంగిపోయారని అన్నారు. వారి నుంచి ఉగ్రవాద సాహిత్యంతో పాటు రెండు పిస్టల్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.