Vishnu Vardhan Reddy: పుట్టినరోజున కూడా అబద్ధాలు చెప్పారు: జగన్ పై విష్ణువర్ధన్‌రెడ్డి ఫైర్
- కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పేరు మార్చి ప్రారంభించారు
- ప్రభుత్వ పథకాలకు జగన్ పేరు పెట్టుకోవడాన్ని ఖండిస్తున్నాం
- పేర్లు మార్చుతూ ప్రజలను ఎన్నాళ్లు ఏమార్చగలరు?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుట్టినరోజున కూడా జగన్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ప్రజల స్థలాలను రక్షించడం కోసం, భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం 'స్వావిత్వ'ను ప్రవేశపెట్టిందని... దీన్నే 'వైయస్సార్ జగనన్న భూహక్కు-భూ రక్ష' పేరుతో పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి ప్రారంభోత్సవాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పేర్లు మార్చుతూ ప్రజలను ఎన్నాళ్లు ఏమార్చగలరని నిలదీశారు. మీరు పేరు మార్చిన పథకానికి కనీసం ప్రధాని మోదీ ఫొటోనైనా పెట్టరా? అని నిలదీశారు.
జగన్ గారు కాంగ్రెస్ పార్టీని మాత్రమే వదిలిపెట్టారని... ఆయనలో ఇప్పటికీ కాంగ్రెస్ సంస్కృతి, భావజాలమే ఉందని విష్ణు అన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆయన సొంత పేరునే పెట్టుకోవడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. గత ఆరేళ్ల పాలనలో ప్రధాని మోదీ వేలాది సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని... కానీ, ఏ ఒక్క పథకానికి సొంత పేరును పెట్టుకోలేదని... ప్రధానిని చూసి జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు.