Undavalli: దీనిపై ఆంధ్రావాళ్లే మాట్లాడాలి.. కానీ ఆ పని చేయలేరు: ఉండవల్లి
- గోదావరి నదిపై తెలంగాణ ప్రాజెక్టులు
- ఒకవేళ దానిపై మాట్లాడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరిక
- ఆంధ్ర వాళ్ల ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి మాట్లాడరు
తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కడుతున్న ప్రాజెక్టులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ నదిపై తెలంగాణ ప్రాజెక్టులు కడుతోందని, ఒకవేళ దానిపై మాట్లాడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని వ్యాఖ్యానించారు.
దీనిపై ఆంధ్రావాళ్లే మాట్లాడాలని ఆయన అన్నారు. అయితే, వాళ్ల ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇంకెవరు మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. గోదావరి నదీ జలాలు నిరుపయోగంగా ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను దాటాక ఈ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని నిల్వ చేసేలా రిజర్వాయర్ కడితేనే పోలవరం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పారు.
దాని నిర్మాణానికి పునరావాసం కింద పరిహారం ఇవ్వాలని, లక్షకు పైగా కుటుంబాలకు కేంద్రమే పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఒకరు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం వచ్చిందని చెప్పారు.
కేంద్రమే పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టమైందని తెలిపారు. పునరావాసమే కాకుండా ఆర్అండ్ఆర్, భూసేకరణ, పరిహారం వంటి వాటిని అన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని ఆర్టీఐ ద్వారా తెలిసిందని చెప్పారు.