Bio NTech SE: కరోనా కొత్త స్ట్రెయిన్ కు వ్యాక్సిన్ ను 6 వారాల్లో అభివృద్ధి చేయగలం: బయో ఎన్ టెక్ ధీమా
- ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్తరకం స్ట్రెయిన్ పై ఆందోళన
- రూపు మార్చుకుని బ్రిటన్ లో విజృంభిస్తున్న కరోనా
- నూతన స్ట్రెయిన్ పై ఫైజర్ టీకా గట్టిగా పోరాడుతుందన్న బయో ఎన్ టెక్
- ఫైజర్ తో కలిసి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన జర్మనీ సంస్థ
- కరోనా స్ట్రెయిన్ పై మరింత అధ్యయనం జరగాలని సూచన
జన్యు ఉత్పరివర్తనాలకు గురై రూపు మార్చుకున్న కరోనా మహమ్మారి బ్రిటన్ లో తీవ్ర కలకలం రేపుతుండడం పట్ల జర్మనీకి చెందిన పరిశోధక సంస్థ బయో ఎన్ టెక్ స్పందించింది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తో కలిసి బయో ఎన్ టెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ అనేక దేశాల్లో వినియోగానికి అనుమతులు పొందింది. ఈ నేపథ్యంలో బయో ఎన్ టెక్ కంపెనీ కొత్తరకం కరోనా వైరస్ పై తన అభిప్రాయాలు వెల్లడించింది.
రూపాంతరం చెందిన కరోనా వైరస్ ను ఫైజర్ వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటుందని భావిస్తున్నామని బయో ఎన్ టెక్ ముఖ్య కార్యదర్శి ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కొత్త స్ట్రెయిన్ పై మరింత అధ్యయనం జరగాలని అభిలషించారు. ఒకవేళ కొత్త రకం కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయాల్సి వస్తే 6 వారాల్లోగా ఆ పని చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.