Hyderabad: 'జీడికల్ శ్రీరామచంద్రస్వామి'కి ఇల్లు రాసిచ్చిన దంపతులు!
- భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న జీడికల్ శ్రీరాముడు
- ఇలవేల్పుగా కొలుచుకుంటున్న లిఖిత, జానకిరామ్ దంపతులు
- ఇంటిని రాముడిపేర రాసి, పేపర్లను హుండీలో వేసిన వైనం
హైదరాబాద్‌కు చెందిన దంపతులు తమ ఇలవేల్పు అయిన శ్రీరాముడికి ఇల్లు రాసిచ్చి తమ భక్తిని చాటుకున్నారు. జనగామ జిల్లాలోని జీడికల్‌లో కొలువైన శ్రీరామచంద్రస్వామి కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. హైదరాబాద్ శివారులోని మాదన్నపేటకు చెందిన లిఖిత, జానకిరామ్ దంపతులకు జీడికల్ రాముడు ఇలవేల్పు. ఈ నేపథ్యంలో శ్రీరాముడికి వీరు తమ ఇంటిని రాసిచ్చి తమలోని భక్తిని చాటుకున్నారు.
తమ ఇంటిని రాముడికి రాసిచ్చిన పేపర్లను వారు అక్కడి హుండీలో వేసి వచ్చేశారు. ఆలయ అధికారులు మొన్న హుండీని లెక్కిస్తుండగా ఈ పేపర్లు బయటపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సాక్షి సంతకాలతో ఉన్న ఈ బాండ్ పేపర్లను ఈవో శేషుభారతి మీడియాకు చూపించారు. ఇల్లు రాసిచ్చిన భక్తులను కలిసి పూర్తి వివరాలు సేకరించనున్నట్టు తెలిపారు.