Nara Lokesh: వ్యవసాయశాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడు: లోకేశ్
- చరణ్‌సింగ్ గారి జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరపడం మన ఆనవాయితీ
- రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సంస్కరణలు తీసుకొచ్చారు
- నేడు రైతుల పాలిట రాబందుగా జగన్
- రైతుల భవిష్యత్తు అంధకారం చేసేందుకు మీటర్లు
- రైతు వ్యతిరేక విధానాల వలన రోజుకో అన్నదాత ఆత్మహత్య
వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే వైఎస్ జగన్ పట్టించుకోవట్లేదని, వ్యవసాయశాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడని లోకేశ్ అన్నారు.
‘వ్యవసాయ రుణాలు అందించి, కౌలు రైతుల హక్కులు కాపాడేందుకు చట్టం తెచ్చిన రైతుబంధు చరణ్‌సింగ్ గారి జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరపడం మన ఆనవాయితీ. నాటి పాలకులు రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు సంస్కరణలు తీసుకొస్తే నేడు రైతుల పాలిట రాబందుగా మారిన వైఎస్ జగన్.. రైతుల భవిష్యత్తు అంధకారం చేసేందుకు మీటర్లు బిగిస్తున్నాడు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాల వలన రోజుకో అన్నదాత ఆత్మహత్యకి పాల్పడటం ఆవేదనకు గురిచేస్తోంది. ఒకపక్క పొలంలో రైతు సాయం కోసం ఎదురుచూస్తుంటే మన వ్యవసాయశాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడు’ అని లోకేశ్ విమర్శించారు.
‘కట్టేవి కూలగొట్టడం.. వీలుకాపోతే రంగు లేయడం, అదీ సాధ్యం కాకపోతే స్టిక్కర్లు అంటించడం మాత్రమే తెలిసిన జగన్‌రెడ్డి.. చరణ్‌సింగ్ జయంతి రోజున జరగాల్సిన రైతు దినోత్సవాన్ని కూడా తన తండ్రి వైఎస్ జయంతికి మార్చుకున్నాడు’ అని లోకేశ్ చెప్పారు
‘రైతులు ఆత్మస్థైర్యంతో ఉండాలి, నియంత జగన్ రెడ్డి కొమ్ములు వంచి మీకు న్యాయం జరిగేలా పోరాడటానికి నేను మీ ముందు ఉంటాను. తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా రైతన్నలకు అండగా నిలబడుతుంది, పోరాడుతుంది. దేశ సమైక్యతకు ఆయువుపట్టుగా నిలుస్తున్న మా అన్నదాతలకు జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు’ అని లోకేశ్ చెప్పారు.