Bandi Sanjay: పీవీకి నివాళి అర్పించి, కేసీఆర్ పై మండిపడ్డ బండి సంజయ్
- రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి తిలోదకాలివ్వని మహానేత పీవీ
- 7వ నిజాం స్ఫూర్తితో పాలిస్తున్న నేత కేసీఆర్
- పీపీ స్ఫూర్తితో కేసీఆర్ పై బీజేపీ పోరాటం చేస్తుంది
మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళి అర్పించారు. తమ పార్టీ నేతలతో కలిసి పీవీ ఘాట్ కు వెళ్లిన సంజయ్ అంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గొప్ప రాజకీయ చతురతతో, విశిష్ట గుణసంపదతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన మన మహోన్నత శిఖరం పీవీ అని కొనియాడారు. దేశాన్ని రక్షించు, దేశాన్ని స్మరించు అనే మాటకు జీవిత కాలమంతా కట్టుబడిన నాయకుడని అన్నారు.
'స్వర్గీయ పీవీ నరసింహారావు గారు, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యక్తి కావడం, మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడం సంతోషకరం. అపర చాణక్యుడే కాదు, ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనూ రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి తిలోదకాలివ్వని అసలు సిసలైన ప్రజాస్వామ్యవాది. పీవీ తెలంగాణకే కాదు, మన భారత్ కు ఠీవీ.
సంస్కరణ శీలిగా పీవీ నరసింహారావు గారు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఏనాడు పదవుల గురించి ఆలోచించని వ్యక్తి. భూ సంస్కరణలు తీసుకొస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి పదవికే గండం ఏర్పడినా, పదవి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న మహోన్నత వ్యక్తి. దేశంలో మెజార్టీ ప్రజల నిర్ణయం మేరకు రామజన్మభూమి కోసం శ్రీ పీవీ నరసింహారావు గారు తమ పాత్ర పోషించారు. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. అందుకే దేశంలో ఎక్కడ పోటీ చేసినా వారు విజయం సాధించారు. దేశ సంక్షేమార్థం వారు తీసుకొచ్చిన సంస్కరణలు, వారి ఆలోచన విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం' అని సంజయ్ ట్వీట్ చేశారు.
పీవీ నరసింహారావుపై కేసీఆర్ ది కేవలం నకిలీ ప్రేమ మాత్రమేనని బండి సంజయ్ మండిపడ్డారు. వర్ధంతి కార్యక్రమానికి కేసీఆర్ రాకపోవడం పీవీని అవమానించడమేనని అన్నారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే పీవీ జయంతి ఉత్సవాలను చేశారని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికలు అయిపోవడంతో కేసీఆర్ బయటకు రావడం లేదని... అసలు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదని ఎద్దేవా చేశారు. 7వ నిజాంను స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. పీవీ స్ఫూర్తితో నేటి 8వ నిజాం అయిన కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు.