Ravi Shankar Prasad: వేర్పాటువాదుల చెంప చెళ్లుమనిపించినట్టుగా ఉంది: జమ్మూ కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై బీజేపీ
- జమ్మూకశ్మీర్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది
- స్థానిక ఎన్నికల్లో 74 స్థానాల్లో గెలుపొందింది
- ఇది మోదీ సాధించిన విజయం
జమ్ముకశ్మీర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వేర్పాటువాదులకు చెంపపెట్టని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. జమ్మూకశ్మీర్ లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలన్నింటికీ కలిపి వచ్చిన ఓట్ల కన్నా... బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. బీజేపీ అత్యధికంగా 74 స్థానాల్లో విజయం సాధించిందని.. దీనికి తోడు బీజేపీ మద్దతుతో 39 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారని చెప్పారు. కూటమిలోని అన్ని పార్టీలు కలిపి 100 స్థానాల్లో మాత్రమే గెలిచాయని అన్నారు.
ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం అసాధ్యమనే భావనతోనే... అన్ని పార్టీలు కలిసి గుప్కార్ కూటమిగా ఏర్పడ్డాయని రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. ఇది ప్రధాని మోదీ సాధించిన విజయమని చెప్పారు. కేంద్ర పాలనతో కశ్మీర్ లోయలో అభివృద్ది ఊపందుకుందని తెలిపారు. గత పాలకులకు, ఇప్పుడు సేవ చేస్తున్న వారికి మధ్య ఉన్న తేడా ఏమిటో కశ్మీర్ ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంపై కశ్మీర్ ప్రజలకు నమ్మకం పెరిగిందని అన్నారు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370ని మర్చిపోలేదని.. ఇదే విషయం స్థానిక ఎన్నికల ఫలితాలతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అర్థమై ఉంటుందని అన్నారు. పీడీఎఫ్, నేషనల్ కాన్ఫరెన్స్ లతో కూడిన గుప్తాక్ కూటమి జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధించిందని చెప్పారు.