Pawan Kalyan: ధర్మం కోసమే ఏసుక్రీస్తు శిలువను ఎక్కారు: పవన్ కల్యాణ్
- జనసేన తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పవన్
- విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేలా ప్రార్థనలు చేయాలని పిలుపు
- క్షమ, కరుణ, ప్రేమ, త్యాగం అనేవి మానవ జీవితానికి చాలా అవసరం అని వ్యాఖ్య
రేపు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడులు ఘనంగా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సోదరసోదరీమణులకు తన తరపున, జనసేన తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. మానవాళి మొత్తం విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేలా ప్రార్థనలు చేయాలని కోరుతున్నానని తెలిపారు.
ధర్మాన్ని ఆచరించేవారికి ధైర్యం మెండుగా ఉంటుంది అనేందుకు క్రీస్తు జీవితమే ఒక తార్కాణమని పవన్ చెప్పారు. ధర్మం కోసమే పెద్దలను ప్రశ్నించి ఏసుక్రీస్తు శిలువను ఎక్కారని తెలిపారు. అయినప్పటికీ ఏ దశలోనూ ఆయన భయపడకుండా తన సువార్తను ఎంతో సహనంతో, సాహసంతో ప్రవచించారని చెప్పారు. క్షమ, కరుణ, ప్రేమ, త్యాగం అనేవి మానవ జీవితానికి చాలా అవసరమని... వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పిన క్రీస్తు బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు.