Amartya Sen: ‘ఠాగూర్ విశ్వభారతి’ భూముల కబ్జా.. అక్రమార్కుల లిస్టులో అమర్త్యసేన్ పేరు!

Vishwa Bharati Lists Amartyasen on Illegal plot holders
  • ప్రభుత్వ హక్కు పత్రాల్లో తప్పుల వల్లే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి
  • అక్రమార్కులు స్కూళ్లు, రెస్టారెంట్లు నడుపుతున్నారని ఆవేదన
  • అమర్త్యసేన్ 13 సెంట్లు ఆక్రమించారని బెంగాల్ ప్రభుత్వానికి లేఖ
  • దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నానని వివరణ ఇచ్చిన అమర్త్యసేన్
శాంతినికేతన్ లో లీజుకిచ్చిన భూముల పరిధిని దాటి మరిన్ని భూములను చాలా మంది ఆక్రమించారని, అందులో భారతరత్న, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కూడా ఉన్నారని విశ్వభారతి ట్రస్ట్ ఆరోపించింది. దీనిపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ట్రస్ట్ లేఖ రాసింది. వాళ్లందరి పేరు మీదా అక్రమంగా ప్లాట్లను రాసిచ్చేశారని అసహనం వ్యక్తం చేసింది. బాలికా వసతి గృహం, విద్యా శాఖ, విశ్వభారతి విశ్వవిద్యాలయ వీసీ అధికారిక బంగళాలనూ ప్రైవేటు వ్యక్తుల పేరిట తప్పుగా నమోదు చేశారని ఆరోపించింది.

ప్రభుత్వ హక్కు పత్రాల్లో యాజమాన్య హక్కులను తప్పుగా నమోదు చేయడం వల్ల.. ప్లాట్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్నాయని ఆక్షేపించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కష్టించి సమీకరించిన భూముల్లో ప్రైవేటు వ్యక్తులు పాగా వేస్తున్నారని, అక్రమంగా పాఠశాలలు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 1980, 1990ల్లోనే ఈ తప్పులతడక రికార్డులను తయారు చేశారని, ఆక్రమణలకు గురైన ప్లాట్లు శాంతినికేతన్ లోని పూర్వపల్లిలోనే ఉన్నాయని చెప్పింది.

అమర్త్యసేన్ విషయానికొస్తే.. ఆయన తండ్రికి విశ్వభారతి లీజుకిచ్చిన 125 సెంట్ల (డెసిమల్) భూమికి అదనంగా అమర్త్యసేన్ మరో 13 సెంట్లు ఆక్రమించారని విశ్వభారతి ట్రస్ట్ ఆరోపించింది. 2006లో లీజు హక్కులను తన తండ్రి పేరు నుంచి తన పేరు మీదకు మార్చాల్సిందిగా అమర్త్యసేన్.. ట్రస్ట్ కు లేఖ రాశారని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తర్వాత ఆయన పేరు మీదకు మార్చామని ఓ అధికారి చెప్పారు. అయితే, మిగతా ఎక్కువ భూమిని మాత్రం ట్రస్ట్ కు అప్పగించలేదంటున్నారు.

ఈ ఆరోపణలపై అమర్త్యసేన్ స్పందించారు. విశ్వభారతి భూముల్లో తాము దీర్ఘకాలిక లీజుకు ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. ఇప్పట్లో ఆ ఒప్పందం పూర్తయ్యే అవకాశాల్లేవన్నారు. కానీ, విశ్వభారతి యూనివర్సిటీ ఉపకులపతి విద్యుత్ చక్రవర్తి మాత్రం.. తాను వేటినైనా తొలగించేయగలనని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బెంగాల్ పై పట్టు కోసం ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తికి శాంతినికేతన్ సంస్కృతి గురించి అస్సలు తెలియదన్నారు. శాంతినికేతన్ లో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఆ విషయం చెబుతున్నానని అన్నారు.
Amartya Sen
VishwaBharathi
Rabindranath Tagore

More Telugu News