COVAXIN: భారత టీకా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది: ఐసీఎంఆర్
- కొవ్యాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు
- భారత్ బయోటెక్‌తో అగ్రరాజ్యానికి చెందిన ఆక్యుజెన్ ఒప్పందం
- అమెరికా మార్కెట్ కోసం ఈ టీకా అభివృద్ధి
- ప్రయోగ ఫలితాల్ని ప్రచురించేందుకు జర్నల్ లాన్సెట్ సిద్ధం
దేశీయంగా తయారుచేసిన కరోనా టీకా కొవ్యాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ సానుకూల ఫలితాలను ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. మూడో దశ ట్రయల్స్‌లో ఇప్పటివరకు 13 వేల మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి.
ఈ టీకా గురించి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) పలు విషయాలు వెల్లడించింది. ఇది ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని తెలిపింది. కొవ్యాగ్జిన్ భద్రత, రోగనిరోధకత విషయంలో చాలా ఆశాజనకంగా ఉందని, ప్రముఖ అంతర్జాతీయ వైద్య జర్నల్ లాన్సెట్ మన కోవ్యాగ్జిన్ ప్రయోగ ఫలితాల్ని ప్రచురించేందుకు ముందుకు వచ్చిందని తెలిపింది.
ఇప్పటికే రెండు విడతల ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిందని, ఇప్పుడు కోవ్యాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయని తెలిపింది. దేశంలో మొత్తం 22 ప్రాంతాల్లో ఈ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని చెప్పింది.
ఇదిలావుంచితే, అమెరికా మార్కెట్ కోసం కూడా ఈ టీకాను అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్‌తో అగ్రరాజ్యానికి చెందిన ఆక్యుజెన్ ఒప్పందం కుదుర్చుకుంది.