Nara Lokesh: ఇళ్లకు నీలం రంగువేసినంత మాత్రాన సైకిల్ బ్రాండ్ ఎంతమాత్రమూ చెరిగిపోదు: నారా లోకేశ్
- జగన్ త్రీ ఇన్ వన్ స్కాం విలువ రూ. 6,500 కోట్లు
- తన ఇంట్లోని మరుగుదొడ్డి కంటే తక్కువ స్థలాన్ని ఇస్తున్నారు
- జగన్‌ను ఫేక్ సీఎం అని అందుకే అనేది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను ఫేక్ సీఎం అని ఎందుకు అంటామో ఇప్పటికైనా తెలుసుకోవాలంటూ వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు. పేదలకు అది సెంటు స్థలమే అయినా, వైసీపీ ఎమ్మెల్యేకు అది కుంభస్థలమని అన్నారు. స్థల సేకరణ నుంచి పంపిణీ వరకు అన్నింటా అవినీతేనని, పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పేరుతో జగన్ చేస్తున్న త్రీ ఇన్ వన్ స్కాం విలువ రూ. 6,500 కోట్లు అని ఆరోపించారు.
తమ హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు నీలం రంగువేసినంత మాత్రాన సైకిల్ బ్రాండ్ ఎంతమాత్రమూ చెరిగిపోదన్నారు. కొండలు, గుట్టలు, శ్మశానాలు, చెరువుల్లో జగన్ ఇంట్లోని మరుగుదొడ్డి కంటే తక్కువగా ఇచ్చే స్థలంలో పేదలు ఉంటారనుకోవడం పొరపాటేనని లోకేశ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌తోపాటు చిప్పకూడు తినడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. టీడీపీ కేసుల వల్లే స్థలం ఇవ్వలేకపోతున్నామన్న జగన్ ఇప్పుడెలా ఇస్తున్నారో చెప్పాలన్న లోకేశ్.. అందుకే జగన్‌ను ఫేక్ సీఎం అంటున్నామని ముగించారు.