Bihar: రోజూ తొమ్మిది హత్యలు, నాలుగు అత్యాచారాలు.. బిహార్ లో పెరుగుతున్న నేరాలు
- తొమ్మిది నెలల్లో 2,406 హత్యలు, 1,106 రేప్ ఘటనలు
- 159 హత్యలతో టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్ర రాజధాని పాట్నా
- బీహార్ నేర రికార్డుల బ్యూరో డేటా వెల్లడి
- హోం మంత్రి రాజీనామా చేయాలన్న తేజస్వి యాదవ్
బిహార్ లో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. రోజూ సగటున 9 హత్యలు జరుగుతుంటే.. నలుగురు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు.. ఆ రాష్ట్ర నేర రికార్డుల బ్యూరో (ఎస్ సీఆర్ బీ) విడుదల చేసిన డేటా చెబుతున్న వాస్తవాలివి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొమ్మిది నెలల కాలానికి సంబంధించి రాష్ట్రంలో జరిగిన నేరాల లెక్కలివి.
ఈ తొమ్మిది నెలల కాలంలో 2,406 హత్యలు జరగ్గా.. 1,106 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. బీహార్ కు రాజధాని అయిన పాట్నా.. నేరాలకూ రాజధానిగా మారిపోయింది. మొత్తంగా 159 హత్యలతో ఈ నగరం ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గయ 138 హత్యలు, ముజఫర్ పూర్ 134 హత్యలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. హత్యలకు ప్రధాన కారణం భూ వివాదాలు, వ్యక్తిగత కక్షలేనని పోలీసులు చెబుతున్నారు.
నేరాలు పెరుగుతుండడంపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్.. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గురువారం దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ‘‘వందల కొద్దీ హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు, దోపిడీలు.. ఇదే ఇన్నేళ్ల మీ పాలనలో మీరు సాధించింది. నేరాలు పెరగడంపై బాధ్యత వహిస్తూ హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు నేరాలు పెరుగుతుండడంపై నితీశ్ కుమార్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్న వెంటనే.. పోలీసు ఉన్నతాధికారులతో దీనిపై ఆయన సమావేశమయ్యారు కూడా. నేరాలను అదుపు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.