Ayyanna Patrudu: ప్రభుత్వ భూముల కబ్జా కోసమే ఇళ్ల పట్టాల పంపిణీ: అయ్యన్నపాత్రుడు
- ఇళ్ల పట్టాల పేరుతో జగన్ మాయాజాలం చేస్తున్నారు
- రూ. 6,500 కోట్ల అవినీతి చోటుచేసుకుంది
- అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి చేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో జగన్ మాయాజాలం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకే ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు.
ఇళ్ల పట్టాల పంపిణీలో రూ. 6,500 కోట్ల మేర అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. భూసేకరణలో రూ. 4 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని అన్నారు. భూమి చదును పేరుతో రూ. 2 వేల కోట్లను దోచుకున్నారని చెప్పారు. పట్టాల పేరుతో వైసీపీ చేసిన అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కాసేపటి క్రితం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రూ. 28 వేల కోట్లతో తొలి దశలో 16.5 లక్షల ఇళ్లను నిర్మించనున్నామని తెలిపారు. రెండు వారాల పాటు ఇళ్ల పట్టాల పంపిణీని ఒక పండుగలా నిర్వహిస్తామని చెప్పారు.