Jagan: పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కొందరు ఓర్చుకోలేకపోతున్నారు: సీఎం జగన్
- అమరావతిలో ఇళ్ల స్థలాలను అడ్డుకున్నారు
- నిన్న కూడా కోర్టులో పిల్ వేశారు
- ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇల్లు ఇస్తున్నాం
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీపై ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. అమరావతిలో 54 వేల మందికి ఇళ్ల స్థలాలను ఇస్తామంటే అడ్డుకుంటున్నారని అన్నారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే కొందరు ఓర్చుకోలేకపోతున్నారని దెప్పిపొడిచారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని నిన్న కోర్టులో పిల్ కూడా వేశారని దుయ్యబట్టారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పట్టాలను ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు.
టిడ్కో ఇళ్లకు గత ప్రభుత్వం రూ. 3 వేల కోట్ల బకాయిలు పెట్టిందని అన్నారు. తాము రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇల్లు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను కూడా తీరుస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాల వల్ల దాదాపు 30 రకాల వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఇసుక, సిమెంట్, ఇనుము, రాయి తదితరాల వినియోగం పెరుగుతుందని తెలిపారు.
ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అన్నది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఇప్పుడు ప్లాట్లు దక్కని వారు దరఖాస్తు చేసుకోవాలని... 90 రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. కోర్టుల్లో న్యాయపరమైన చిక్కులు తొలగిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్లు చేసి అప్పగిస్తామని చెప్పారు.