velagapudi: నేడు గుడిలో ప్రమాణం చేయాలని విజయసాయిరెడ్డికి ఎమ్మెల్యే వెలగపూడి సవాలు.. గుడి వద్ద భారీగా బందోబస్తు
- విశాఖపట్నంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలంటూ ఆరోపణలు
- వెలగపూడిపై మండిపడ్డ విజయసాయిరెడ్డి
- ప్రమాణం చేసి చెప్పాలని వెలగపూడి సవాలు
- ప్రమాణం చేసేందుకు నేడు గుడికి వెళ్లాలని నిర్ణయం
ఇటీవల అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుని గుడికెళ్లి ప్రమాణాలు చేయాలంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే. ఏపీలో మరోసారి ఇరు పార్టీల నేతల మధ్య ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. విశాఖపట్నంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు జరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాాజాగా ఆరోపించారు.
ఈ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందిస్తూ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. భూ అక్రమాలకు పాల్పడ్డానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణలను విజయసాయిరెడ్డి నిరూపించాలని అన్నారు.
తనపై చేసిన ఆరోపణలు నిజమే అంటూ దమ్ముంటే గుడిలో ప్రమాణం చేయాలని విజయసాయిరెడ్డికి వెలగపూడి సవాలు విసిరారు. తాను అక్రమాలకు పాల్పడలేదని సాయిబాబా గుడిలో ప్రమాణం చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే, వైసీపీ తరఫున ప్రమాణానికి ఆ పార్టీ నాయకురాలు విజయనిర్మల సిద్ధమయ్యారు.
ఇరు పార్టీల నాయకుల ప్రమాణాల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అంతేగాక, ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్ద మూడంచెల పోలీసు పహారా ఏర్పాటు చేశారు.