Velagapudi Ramakrishna: నేను విజయసాయిరెడ్డికి సవాల్ విసిరితే మధ్యలో వీళ్లెవరు?: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం

TDP MLA Velagapudi Ramakrishna gets anger over YCP leaders

  • ఏపీలో కొనసాగుతున్న సత్యప్రమాణాల పర్వం
  • ఇటీవలే దైవప్రమాణం చేసిన అనపర్తి నేతలు
  • తాజాగా విజయసాయిరెడ్డికి సవాల్ విసిరిన వెలగపూడి రామకృష్ణ
  • తాను ప్రమాణం చేస్తానన్న వైసీపీ నేత విజయనిర్మల
  • తాను సవాల్ విసిరింది విజయసాయికని వెలగపూడి స్పష్టీకరణ

ఏపీలో ప్రస్తుతం సత్యప్రమాణాల పర్వం నడుస్తోంది! కొన్నిరోజుల కిందటే అనపర్తి శాసనసభ్యుడు  సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుని బిక్కవోలు లక్ష్మీ గణపతి దేవస్థానంలో సత్యప్రమాణం చేశారు. తాజాగా, ఇలాంటి సత్యప్రమాణాల అంశం మరొకటి తెరపైకి వచ్చింది. భూ అక్రమాలకు పాల్పడినట్టు తనపై ఆరోపణలు చేస్తున్న విజయసాయి సాయిబాబా ముందు దైవ ప్రమాణం చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సవాల్ విసిరారు.

అయితే, వైసీపీ తరఫున ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమంటూ ఆ పార్టీ నేత విజయనిర్మల ముందుకొచ్చారు. అంతేకాదు,  ఎమ్మెల్యే వెలగపూడి సింహాచలంలో ప్రమాణం చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే వెలగపూడి స్పందించారు.

"నేను విజయసాయిరెడ్డికి సవాల్ విసిరితే మధ్యలో వీళ్లెవరు? అని అసహనం ప్రదర్శించారు. నేను విజయసాయిరెడ్డిని ప్రమాణం చేయమన్నాను. కానీ వైసీపీ వాళ్లు నేను సింహాచలం రావాలంటున్నారు. నేనెంతో నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నా. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడబోను. అయినప్పటికీ వైసీపీ సవాలుకు నేను సిద్ధం... మరి విజయసాయిరెడ్డి కూడా వస్తారా?" అని ప్రతి సవాలు విసిరారు.

అటు, విశాఖలో వైసీపీ మహిళా నేత విజయనిర్మలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె సాయిబాబా చిత్రపటంతో ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయానికి వస్తుండగా, పోలీసులు ఆపేశారు. దాంతో ఆమె తన వర్గంతో కలిసి వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News