Shilpa Chakrapani Reddy: రాజాసింగ్... అనవసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదు: శిల్పా చక్రపాణిరెడ్డి వార్నింగ్
- శ్రీశైలం దేవస్థానం అంశంలో రాజాసింగ్ వ్యాఖ్యలు
- తీవ్రంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
- చర్చకు ఎప్పుడొస్తావో చెప్పంటూ రాజాసింగ్ కు సవాల్
- ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి
- మతం అంశంతో బీజేపీ ఎదగాలనుకుంటోందని వ్యాఖ్యలు
శ్రీశైలం మల్లన్న దేవస్థానం పరిసరాల్లో ముస్లింలకు దుకాణాలు కేటాయించడంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రజాక్ అనే వ్యక్తితో చేతులు కలిపిన శ్రీశైలం ఎమ్మెల్యే 70 శాతం దుకాణాలను ముస్లింలకే కేటాయించారని రాజాసింగ్ తెలిపారు. దీనిపై శ్రీశైలం ఎమ్మెల్యే, వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు సవాల్ విసిరారు. రాజాసింగ్ నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు... శ్రీశైలంలోనే పెద్దల సమక్షంలో చర్చకు కూర్చుందాం అని స్పష్టం చేశారు.
తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటానని శిల్పా వెల్లడించారు. మరి, ఆరోపణలు నిరూపించలేకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధమేనా? అంటూ రాజాసింగ్ కు సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించారు. తనపై హిందూ ద్రోహిగా ముద్రవేయాలని చూస్తున్నారని, ఇలాంటి కుయుక్తులను తాను సహించబోనని శిల్పా స్పష్టం చేశారు. బీజేపీ మతాన్ని అడ్డంపెట్టుకుని ఏపీలో ఎదగాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.